హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జనవాణి): కొత్తగా లగ్జరీ కారు కొనుగోలు చేశామన్న ఆనందం ఆ యువకుడికి ఎంతోసేపు నిలవలేదు. హైదరాబాద్‌లో BMW కారు డెలివరీ తీసుకునేందుకు షోరూమ్‌కు వెళ్లిన అతడికి అక్కడ కొందరు ట్రాన్స్‌జెండర్ల నుంచి అనూహ్య పరిస్థితి ఎదురైంది. కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలో అతడిని చుట్టుముట్టి రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం.
సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు లేదా శుభకార్యాల సమయంలో ట్రాన్స్‌జెండర్లు వచ్చి తమ సంప్రదాయం ప్రకారం కొంత మొత్తాన్ని అడగడం కనిపిస్తుంటుంది. అయితే ఈ ఘటనలో డిమాండ్ ఏకంగా లక్షల రూపాయలకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది.
క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు పంపాలని ఒత్తిడి
తన వద్ద అంత మొత్తం లేదని, తనకు సాధ్యమైనంత ఇస్తానని యువకుడు చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. నగదు లేదని చెప్పడంతో తమ ఫోన్లలోని UPI క్యూఆర్ కోడ్‌లను చూపించి రూ.2 లక్షలు ఆన్‌లైన్‌లో పంపాలని నానా హంగామా సృష్టించారు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించడం సాధ్యం కాదని యువకుడు స్పష్టం చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
కొత్త కారు డెలివరీ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో సదరు యువకుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇలాంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించి, ఎవరైనా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Loading Tweet...




















