హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): హైదరాబాద్‌లో మహా గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భారీగా నిమజ్జనాలు జరగడంతోపాటు ముస్లిం ప్రార్థనలు కూడా ఉండటంతో చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
చార్మినార్ పరిసరాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు. భద్రతా కారణాలతో చార్మినార్ సమీపంలోని కొన్ని దుకాణాలను కూడా మూసివేయించారు. రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
బాలాపూర్ నుంచి చార్మినార్, అక్కడి నుంచి మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా నిమజ్జన మార్గాల్లోకి గణేశ్ విగ్రహాలు తరలివస్తున్నాయి. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండగా, శోభాయాత్రలు సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు 20 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. నాలుగు కమిషనరేట్ల పరిధిలో కలిపి సుమారు 45 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో అదనపు బలగాలను కూడా అందుబాటులో ఉంచారు.
గణేశ్ శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో సుమారు 10 వేల సీసీ కెమెరాలను తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)కి అనుసంధానించారు. వీటి ద్వారా రద్దీ, ట్రాఫిక్, అనుమానాస్పద కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో హైరిజల్యూషన్ కెమెరాలతోపాటు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ప్రత్యేకంగా విధుల్లో ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో బృందాలు పనిచేస్తున్నాయి. చోరీలు, వేధింపులు వంటి ఘటనలను అడ్డుకునేందుకు క్రైమ్ టీమ్స్‌ను కూడా రంగంలోకి దించారు.
ఖైరతాబాద్ బడా గణేశ్, బాలాపూర్ గణేశ్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యమైనప్పటికీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 5 వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొత్తంగా గణేశ్ నిమజ్జనం, శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు రావడంతో చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింత పెంచారు. విస్తృత తనిఖీలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, భారీ బందోబస్తు మధ్య నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా సాగేలా చర్యలు కొనసాగిస్తున్నారు.




















