పాతబస్తీ మెట్రోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. టెండర్లు, భూసేకరణ వేగవంతం

హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2లోని ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ కారిడార్ పనులను వేగవంతం చేసి, టెండర్లు, భూసేకరణ ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

11 ఆగస్టు, 2026 6:31 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పాతబస్తీ మెట్రోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. టెండర్లు, భూసేకరణ వేగవంతం

Social Media Image

హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): హైదరాబాద్ మెట్రో రైల్లో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ (HMRL) ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనుల పురోగతి, ప్రయాణికుల రద్దీ, ఫేజ్-2 విస్తరణపై సమీక్షించారు.

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఢిల్లీ మెట్రో సలహాలు తీసుకోవాలి

పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అంశంపై ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీపై అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.

మెట్రోకు అదనపు కోచ్‌లు

హైదరాబాద్ మెట్రోలో పెరుగుతున్న రద్దీపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బోగీలను జత చేయాలని సూచించారు. ఇందుకోసం కొత్త మెట్రో రైల్ కోచ్‌ల కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష

డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సీఎం అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్‌ను నిర్వహించి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. గత ఏడాది సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వాటి పురోగతిపై పూర్తి వివరాలను నివేదించాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడులను మరింత పెంచేందుకు అవసరమైన కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు