హైదరాబాద్‌లో కొలువుదీరిన ‘పెన్‌ షో’..రూ.50 నుంచి రూ.7.80 లక్షల వరకు అరుదైన కలెక్షన్లు

డిజిటల్‌ యుగంలో పెన్నుల వినియోగం తగ్గుతున్నా వాటిపై అభిమానం మాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ‘హైదరాబాద్‌ పెన్‌ షో-2026’ నిలుస్తోంది. రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వచ్చిన తయారీదారులు అరుదైన, ప్రత్యేకమైన పెన్నులను ప్రదర్శిస్తున్నారు. రూ.50 నుంచి ఏకంగా రూ.7.80 లక్షల విలువైన పెన్నులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

3 అక్టోబర్, 2026 1:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో కొలువుదీరిన ‘పెన్‌ షో’..రూ.50 నుంచి రూ.7.80 లక్షల వరకు అరుదైన కలెక్షన్లు

హైదరాబాద్‌, అక్టోబర్ 3 (జనవాణి): ప్రేమలేఖ రాయాలన్నా క్లాస్‌రూమ్‌లో నోట్స్‌ రాసుకోవాలన్నా ఒకప్పుడు పెన్నే ఆధారం. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరగడంతో చేతిరాతకు, పెన్నులకు ఆదరణ తగ్గింది. అయితే పెన్నులను కేవలం రాసే సాధనంగా కాకుండా కళాత్మక వస్తువులుగా ఆస్వాదించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. అలాంటి వారిని ఆకట్టుకునేలా హైదరాబాద్‌ పెన్‌ షో-2026 జరుగుతోంది.

రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో ప్రారంభమైన ఈ మూడు రోజుల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 24కు పైగా పెన్నుల తయారీదారులు, ఇంక్‌ రూపకర్తలు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. అరుదైన డిజైన్లు, లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్షన్లు, చేతితో తయారు చేసిన పెన్నులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రూ.50 నుంచి రూ.7.80 లక్షల వరకు వివిధ ధరల పెన్నులు అందుబాటులో ఉన్నాయి.

Hyderabad Pen Show

రాయడం కాదు.. ఓ అనుభూతి

బాల్‌పాయింట్‌ పెన్‌తో రాస్తే అక్షరాలు కాగితంపై పడతాయి. కానీ ఫౌంటెన్‌ పెన్‌తో రాయడం మాత్రం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని నిర్వాహకుల్లో ఒకరైన కృష్ణ మోహన్‌ చెబుతున్నారు. ఫౌంటెన్‌ పెన్‌కు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉన్నారని, నిబ్‌ పరిమాణాన్ని బట్టి అక్షరాల రూపమే మారిపోతుందని ఆయన వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900కు పైగా రకాల ఇంక్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఇలాంటి పెన్‌ షో నిర్వహించడం ఇదే తొలిసారి కాగా, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో మాత్రం ఇలాంటి ప్రదర్శనలు భారీ స్థాయిలో జరుగుతుంటాయని చెప్పారు. గేదె కొమ్ములు, కాంక్రీట్‌ వంటి విభిన్న పదార్థాలతో రూపొందించిన పెన్నులు కూడా ఈ ప్రదర్శనలో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో ఉన్న పెన్నుల్లో అత్యధికం చేతితో తయారు చేసినవే.

Hyderabad Pen Show

పెన్నులా.. కళాఖండాలా!

పూణెకు చెందిన ఉరుషి స్టూడియో ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన ఫౌంటెన్‌ పెన్నులు ఈ ప్రదర్శనలో మరో ఆకర్షణగా నిలిచాయి. మహాభారతంలోని ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించిన ఘట్టం నుంచి వామనావతారం వరకు పలు ఇతివృత్తాలను పెన్నులపై అద్భుతంగా మలిచారు. సంత్‌ జ్ఞానేశ్వర్‌, సంగ్‌ దేవ్‌ మహారాజ్‌ వంటి ప్రముఖుల జీవిత విశేషాలను ప్రతిబింబించే పెన్నులను కూడా రూపొందించారు. వీటి తయారీలో రాగి, ఎబోనైట్‌, వెండి, బంగారం, ప్లాటినమ్‌ వంటి విలువైన పదార్థాలను ఉపయోగించారు. వీటి ధరలు సుమారు రూ.7.50 లక్షల వరకు ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన వివేక్‌ కులకర్ణి తెలిపారు.

Hyderabad Pen Show

రూ.7.80 లక్షల పెన్ను ప్రత్యేక ఆకర్షణ

జర్మనీకి చెందిన స్టెడ్లర్‌ ప్రీమియం రూపొందించిన లిమిటెడ్‌ ఎడిషన్‌ పెన్‌ ఈ ప్రదర్శనలో అత్యంత ఖరీదైన కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది. 48 వజ్రాలు, 18 క్యారెట్ల గోల్డ్‌ నిబ్‌తో రూపొందించిన ఈ పెన్ను ధర రూ.7.80 లక్షలు. మరో ప్రత్యేక మోడల్‌లో కింగ్‌ లూయిస్‌ XIV, సంగీతకారుడు రిచర్డ్‌ వాగ్నర్‌, జర్మన్‌ చిత్రకారుడు అల్బ్రెక్ట్‌ వంటి ప్రముఖుల ప్రతిరూపాలను పొందుపరిచారు. ఈ పెన్నుల ధరలు సుమారు రూ.81 వేల నుంచి రూ.99 వేల వరకు ఉన్నాయి. డిజిటల్‌ పరికరాలు రాతను భర్తీ చేస్తున్న కాలంలోనూ.. కళ, చరిత్ర, నైపుణ్యం కలగలిసిన పెన్నులకు ఉన్న ఆదరణకు హైదరాబాద్‌ పెన్‌ షో-2026 ఓ ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.

Hyderabad Pen Show

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు