హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!

హైదరాబాద్‌ భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. మొత్తం 5.25 ఎకరాల ప్లాట్‌ రూ.1,386 కోట్లకు విక్రయమై.. నగర భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది.

22 ఆగస్టు, 2026 5:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌ భూముల ధరల్లో సరికొత్త రికార్డు..ఎకరం రూ.264 కోట్లు!

హైదరాబాద్, ఆగస్టు 22 (జనవాణి): హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడై నగర చరిత్రలోనే అత్యధిక భూమి ధరగా రికార్డు సృష్టించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌మక్తా గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 83/1లో ఉన్న 5.25 ఎకరాల ప్లాట్‌ నంబర్‌ P1ను టీజీఐఐసీ ఈ-వేలం ద్వారా విక్రయించింది. ఈ భూమికి ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరను నిర్ణయించగా.. వేలంలో భారీ పోటీ నెలకొంది. అంటే, ఎకరానికి రూ. 175 కోట్ల రిజర్వ్ ధరను మించి రూ. 264 కోట్ల ధర సాధించింది. చివరకు 5.25 ఎకరాలను రూ.1,386 కోట్లకు ప్లాట్‌ విక్రయమైంది. టీజీఐఐసీ నిర్ణయించిన రిజర్వ్‌ ధరతో పోలిస్తే ఇది 50.9 శాతం అధికం. ఎంఎస్‌టీసీ పోర్టల్‌ ద్వారా ఈ డిజిటల్‌ వేలాన్ని నిర్వహించగా, జేఎల్‌ఎల్‌ సంస్థ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది.

రాయదుర్గం ప్రాంతంలో భూముల కోసం డెవలపర్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీకి ఈ వేలం నిదర్శనంగా నిలిచిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో సంస్థాగత రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని కూడా ఈ రికార్డు ధర సూచిస్తోందని తెలిపాయి. టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ కే. శశాంక మాట్లాడుతూ.. ప్లాట్‌ P1 వేలంలో నమోదైన స్పందన తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్లకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. పారదర్శకత, మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల విధానాలు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మేలో రాయదుర్గం గ్రోత్‌ కారిడార్‌లోని ఇదే సర్వే నంబర్‌లో 6.29 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. ఆ భూమి రూ.1,490.73 కోట్లకు అమ్ముడవగా.. ఎకరాకు సుమారు రూ.237 కోట్ల ధర నమోదైంది. తాజాగా ప్లాట్‌ P1 ఎకరాకు రూ.264 కోట్లకు విక్రయమై ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది. రాయదుర్గం వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో అత్యుత్తమ భూములకు పెట్టుబడిదారుల డిమాండ్ ఎంత బలంగా ఉందో తాజా వేలం స్పష్టం చేస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు