హైదరాబాద్,సెప్టెంబర్ 21 (జనవాణి): హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.
నిమజ్జనంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ వద్ద బైఠాయించారు. నిరసనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు కిందపడిపోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఉత్సవ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. బారికేడ్లను తొలగించిన అనంతరం వారు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విధించిన ఆంక్షలపై ఉత్సవ సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, ట్యాంక్ బండ్ వద్ద సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకు దిగడంతో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.





















