హైదరాబాద్,సెప్టెంబర్ 5 (జనవాణి): తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. నిర్మాణం, నిర్వహణ కోసం హైపర్‌వాల్ట్, భాగస్వామ్య సంస్థలు కలిసి దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో హైపర్‌వాల్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సచివాలయంలో సమావేశమైంది. టీసీఎస్ సీఈఓ కే. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్‌వాల్ట్ ప్రెసిడెంట్ వీ. రాజన్న, సీఈఓ, ఎండీ దీపేష్ నందా తదితరులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
250 ఎకరాల్లో.. 1,000 మెగావాట్ల సామర్థ్యంతో
250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచస్థాయి ఏఐ సంస్థలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అత్యధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో పర్యావరణహితంగా క్యాంపస్‌ను తీర్చిదిద్దనున్నారు.
ఏఐలో హైదరాబాద్‌కు కొత్త గుర్తింపు
ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో ఈ సామర్థ్యం తెలంగాణలో అందుబాటులోకి రావడం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
టీసీఎస్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడంపై సీఎం అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని, తెలంగాణ రైజింగ్ విజన్-2047లోని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఇది కీలక ముందడుగు అని అన్నారు. డేటా సెంటర్‌తోపాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ భారీగా కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
దావోస్ నుంచే ప్రాజెక్టుకు నాంది
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టును తెలంగాణ దక్కించుకుంది. దీంతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలం చేకూరింది.




















