హైదరాబాద్, ఆగస్టు 5 (జనవాణి): హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ దాదాపు ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOC) తయారు చేసి వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. పత్రాల పరిశీలనలో అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు రూపొందించినట్లు నిర్ధారణ అయింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు నకిలీ పత్రాలు సమర్పించిన ఎనిమిది ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, అధికారిక పత్రాల దుర్వినియోగం తదితర కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా, నకిలీ ధ్రువపత్రాలు మరెక్కడైనా వినియోగించారా అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు..




















