ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అప్‌డేట్..రూ.1 లక్ష చెల్లించకపోతే ఇల్లు రద్దు!..హౌసింగ్ బోర్డు కీలక సూచన

హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల కేటాయింపు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు కీలక సూచన చేసింది. తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా చెల్లించాల్సిన రూ.1 లక్ష మొత్తాన్ని చెల్లించేందుకు గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించింది. ఈలోగా చెల్లింపు చేయని వారి తాత్కాలిక కేటాయింపులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

5 అక్టోబర్, 2026 2:52 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అప్‌డేట్..రూ.1 లక్ష చెల్లించకపోతే ఇల్లు రద్దు!..హౌసింగ్ బోర్డు కీలక సూచన

హైదరాబాద్, అక్టోబర్ 5 జనవాణి): హైదరాబాద్‌ మహానగర పరిధిలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలి దశలో 16 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించి, లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారులకు కేటాయింపు పత్రాల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇళ్ల కేటాయింపు పొందిన వారు విడతల వారీగా మొత్తం రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంది.

అక్టోబర్ 9 వరకు అవకాశం

ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్‌కు అలాట్‌మెంట్ లెటర్ పొందిన లబ్ధిదారులు రూ.1 లక్ష తొలి విడత మొత్తాన్ని చెల్లించేందుకు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు గడువును అక్టోబర్ 9 వరకు పొడిగించింది. అలాట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న వర్చువల్ అకౌంట్ నంబర్, IFSC కోడ్ ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లింపు చేయని లబ్ధిదారుల ప్రొవిజనల్‌ కేటాయింపులు రద్దయ్యే అవకాశం ఉందని తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ స్పష్టం చేశారు. కేటాయింపు రద్దు కాకుండా ఉండేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

5,501 కుటుంబాలకు తాత్కాలిక కేటాయింపులు

లాటరీలో ఎంపికైన లబ్ధిదారుల అర్హతలను అధికారులు పోస్ట్‌-వెరిఫికేషన్‌ ద్వారా పరిశీలిస్తున్నారు. నివాస అర్హత, ఆదాయ పరిమితి, కుటుంబానికి ఇప్పటికే ఇల్లు లేదా ప్లాట్‌ ఉందా?, సమర్పించిన పత్రాల ధ్రువీకరణ తదితర అంశాలను తనిఖీ చేస్తున్నారు. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన వారికి తాత్కాలిక కేటాయింపులు చేస్తున్నారు. ఆదివారం నాటికి 16 నియోజకవర్గాల్లో 5,501 కుటుంబాలకు తాత్కాలిక కేటాయింపు పత్రాలు జారీ చేసినట్లు హౌసింగ్‌ బోర్డు తెలిపింది. వీరిలో ఇప్పటికే 3,271 మంది (59.46 శాతం) రూ.1 లక్ష తొలి విడతను చెల్లించారు.

చెల్లించకపోతే ఫ్లాట్లు ఇతరులకు

ఇంకా చెల్లింపులు చేయని ఎంపికైన లబ్ధిదారులు అక్టోబర్ 9లోగా రూ.1 లక్ష చెల్లించాలని ఎండీ వీపీ గౌతమ్‌ కోరారు. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే తాత్కాలిక కేటాయింపులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రద్దు కారణంగా ఖాళీ అయ్యే ఫ్లాట్లను వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ఇతర అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

మరో 35 వేల మందికి అవకాశం

ఇందిరమ్మ టవర్స్‌ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం కేటాయింపు పొందని సుమారు 35 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులు ఉన్నట్లు హౌసింగ్‌ బోర్డు వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా వీరిని రాబోయే రోజుల్లో నిర్వహించే తదుపరి లాటరీ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఇందిరమ్మ టవర్స్‌ కేటాయింపులు, చెల్లింపులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌(https://tghb.telangana.gov.in/)ను సందర్శించవచ్చు. అలాగే 040-24603572 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు