హైదరాబాద్, జూలై 22: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేసి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో నకుల్ యాదవ్ (27)ను అదుపులోకి తీసుకుంది. ఒడిశాలోని బరంపూర్ నుంచి గంజాయిని తీసుకొచ్చిన అతడు, హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి అప్పగించేందుకు ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి 14 కిలోల గంజాయితో పాటు రూ.2,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి చర్యల నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగుతోందన్నారు.




















