జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్ మృతి

కామారెడ్డి జిల్లా జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

4 సెప్టెంబర్, 2026 3:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, డ్రైవర్ మృతి

కామారెడ్డి, సెప్టెంబర్ 04 (జనవాణి): కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో 161వ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్‌-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కౌలాస్‌ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డి. ఆంజనేయులు సీటు కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కండక్టర్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదానికి ముందు సుమారు 200 మీటర్ల దూరం నుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం కారణంగా బస్సు బోల్తా పడటంతో పాటు ముందు రెండు టైర్లు కూడా విడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాన్సువాడ డీఎస్పీ ఘటనాస్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా శ్రమించిన సిబ్బంది డ్రైవర్ ఆంజనేయులు మృతదేహాన్ని బస్సులో నుంచి బయటకు తీశారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

బాధితులకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

జుక్కల్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వివరించారని చెప్పారు. ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు