జనగామ జిల్లా, ఆగస్టు 29 (జనవాణి): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల్లో జీవో 97పై అనేక అపోహలు, భయాందోళనలు ఉన్నాయని తెలిపారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ అంశంపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. పాలిటెక్నిక్ విద్యను లేబర్ ఎంప్లాయ్‌మెంట్ పరిధిలోకి తీసుకురావద్దని కడియం సూచించారు. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో చేరేందుకు లేటరల్ ఎంట్రీ అవకాశం కొనసాగించాలని కోరారు.
పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసి అదనపు నైపుణ్యాలను అందించాలన్న ప్రభుత్వ ఆలోచన మంచిదేనని కడియం పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల తాము లేబర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వెళ్తామన్న భావన విద్యార్థుల్లో ఏర్పడిందన్నారు. ఈ అపోహలను తొలగించి విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తోందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలని కమిటీకి సూచించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏఐసీటీఈ పరిధిలో కొనసాగుతున్నాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు. విద్యార్థుల భయాందోళనలను తొలగించేందుకు ప్రభుత్వం పెద్ద మనసుతో జీవో 97ను రద్దు చేయాలని కోరారు. జీవోను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లవుతుందని కడియం శ్రీహరి అన్నారు.




















