తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత

తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు, దూషణలకే పరిమితమవుతున్నాయంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

21 సెప్టెంబర్, 2026 11:31 AM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?: కల్వకుంట్ల కవిత

నారాయణపేట, సెప్టెంబర్ 21 (జనవాణి): తెలంగాణలో రాజకీయాలు ప్రజా సమస్యల చుట్టూ కాకుండా పరస్పర విమర్శలు, దూషణల చుట్టూ తిరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 'రాష్ట్రంలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా?’ అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు.

సమాజంలో అధర్మం పెరిగినప్పుడు, ప్రజలు పాలకుల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి ధర్మపోరాటానికి పిలుపునిస్తాడని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత

రైతుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. నీళ్లు, యూరియా, ధాన్యం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పాలమూరు రైతులు జూరాల హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటి కోసం ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. వరి, మొక్కజొన్న రైతులు తమ పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా వెనుకాడబోమని తెలిపారు. పాలమూరు ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

‘నేను ఎవరి బాణాన్ని కాదు’

తనపై బీఆర్‌ఎస్‌, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపైనా కవిత స్పందించారు. తాను కాంగ్రెస్‌ విడిచిన బాణమని బీఆర్‌ఎస్‌ నేతలు, కల్వకుంట్ల కుటుంబం అవినీతి కారణంగా తాను బీఆర్‌ఎస్‌ను వీడిన బాణమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

‘నేను ఎవరి బాణాన్ని కాదు.. తెలంగాణ బహుజనుల బాణాన్ని’ అని కవిత స్పష్టం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్‌ పాడిన ‘భలేగుందిరో మన అసెంబ్లీ’ పాటలోని చరణాలను ఆలపించి సభలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రజలంతా తెలంగాణ రక్షణ సేనకు మద్దతుగా నిలిస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చి బలమైన నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు