ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు, ప్రభుత్వ వైద్య సేవలు, ఓటర్ల జాబితా సవరణ, తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.

26 సెప్టెంబర్, 2026 4:57 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం.. కవిత కీలక ప్రకటన

హైదరాబాద్,సెప్టెంబర్ 26 (జనవాణి): హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపై తెలంగాణ రక్షణ సేన కీలక ప్రకటన చేసింది. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ పార్టీ మార్పుపైనా ఆమె స్పందించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం సరైన విధానం కాదని కవిత వ్యాఖ్యానించారు.

ఓట్ల తొలగింపుపై అనుమానాలు

ఓటర్ల జాబితా సవరణ అంశంపైనా కవిత మాట్లాడారు. క్లరికల్ తప్పిదాల పేరుతో అధికారులు ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ ప్రోత్సాహంతో కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే చర్చ ప్రజల్లో ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ఆవేదన

ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు అత్యంత బాధాకరమని కవిత అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలపై ప్రభుత్వం సమగ్ర దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. నిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రుల్లో మంత్రులు ఫోన్ చేసినా బెడ్లు దొరకని పరిస్థితి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య పథకాలకు తగిన బడ్జెట్ కేటాయించలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా విడుదల చేయలేదని కవిత ఆరోపించారు.

‘పిల్లలు చనిపోతుంటే సింగపూర్ ఎలా చేస్తారు?’

ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించాలని అన్నారు. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలలను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో చిన్నారుల మరణాలు జరుగుతున్న సమయంలో తెలంగాణను డల్లాస్, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఎలా చెబుతుందని సీఎం, మంత్రులను కవిత ప్రశ్నించారు. ఐటీడీఏకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో 70 శాతం వినియోగించలేదని ఆమె ఆరోపించారు.

ఫామ్‌హౌస్ ఆరోపణలపై కవిత వివరణ

తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. అక్కడ ఎలాంటి అక్రమ భూములు లేవని, ఇనాం, కబ్జా లేదా అసైన్డ్ భూమి లేదని స్పష్టం చేశారు. తన ఫామ్‌హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో కూడా లేదని తెలిపారు. తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లోనే వెల్లడించామని చెప్పారు. తనపై, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆరోపించారు. గతంలో ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు