హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి బానిసలు కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సెప్టెంబర్ 18లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ దిగ్బంధానికి సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. వారి పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై టీఆర్ఎస్ నిర్వహించిన సదస్సులో కవిత మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్‌మార్క్ అంటూ విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని ఉపాధ్యాయులు పోరాడారని కవిత గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పాలన అందించాలంటే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూడటం వల్లే పరిపాలన సజావుగా సాగడం లేదని విమర్శించారు.
2023 ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో ఐదు లక్షల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. సుమారు రెండు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. వారి సమస్యలకు భరోసా కల్పించేందుకే సదస్సు నిర్వహించినట్లు చెప్పారు.
ప్రభుత్వ విద్యపై విమర్శలు
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందించాలన్నదే టీఆర్ఎస్ లక్ష్యమని కవిత తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 600 మండలాలు ఉంటే కేవలం ఎనిమిది మంది మాత్రమే పర్మినెంట్ ఎంఈఓలు ఉన్నారని అన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై సమర్థవంతమైన పర్యవేక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
హెడ్‌మాస్టర్లు, సీనియర్ టీచర్లను ఎంఈఓలుగా నియమించడం సరైన విధానం కాదని అన్నారు. వివిధ రకాల రిపోర్టులు, ఇతర పనులతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఉపాధ్యాయుడే ఉన్న పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా ఇవ్వాల్సిన ప్రమోషన్లు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు.
గురుకులాలు, డిగ్రీ కాలేజీల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని కవిత అన్నారు. ఉన్న ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో ఒక పాఠశాల, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా విధానం రూపొందిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
డీఏ, పీఆర్సీపై డిమాండ్లు
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కవిత అన్నారు. గత 32 నెలలుగా డీఏ ఇవ్వకుండా ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పీఆర్సీ గడువు ముగిసే పరిస్థితి ఉందని పేర్కొంటూ వెంటనే 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా పనిచేస్తున్నాయా? అని సీఎం రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. హెల్త్ కార్డు పనిచేస్తుందని నిరూపిస్తే ప్రభుత్వం చెప్పిన విధంగా తాము చేస్తామని, లేదంటే సీఎం రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. ఉద్యోగులు తమ ప్రయోజనాలు, బకాయిల గురించి అడిగితే మరో రెండేళ్లు వేచి చూడాలని ప్రభుత్వం చెబుతోందని ఆమె విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను ఆలస్యం చేస్తే 6 నుంచి 12 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
317 జీవో బాధితులకు న్యాయం చేయాలి
317 జీవో బాధితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. బాధితుల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారు ఇబ్బందులు పడటం తనను బాధిస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్య పరిష్కారానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్న 37 ప్రధాన సమస్యల్లో చాలా వరకు ఆర్థిక అంశాలతో ముడిపడి లేనివేనని కవిత తెలిపారు. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం ఉండదని అన్నారు.
పోలీసుల సమస్యలపైనా స్పందన
రాష్ట్రంలోని పోలీసుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని కవిత అన్నారు. వారికి రావాల్సిన ప్రయోజనాలు అనేకం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. 2003లో నియమితులైన పోలీసులకు ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం) అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 2003లో నియమితులైన ఉపాధ్యాయులకు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని కోరారు. 2003లో నియమితులైన ఉపాధ్యాయులను ఓపీఎస్‌లోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్లు ఆదా అవుతాయని కవిత పేర్కొన్నారు. ఆ మొత్తంతో ఉద్యోగుల ఇతర బకాయిలను చెల్లించవచ్చని సూచించారు.
‘కాంగ్రెస్‌కు భయపడొద్దు’
ప్రభుత్వంపై పోరాటం విషయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలను పదేపదే వాయిదా వేస్తున్నాయని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న ఉద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు ధైర్యంగా పోరాడకపోవడంతో కింది స్థాయి ఉద్యోగుల్లో వారి నాయకత్వంపై నమ్మకం తగ్గుతోందని కవిత వ్యాఖ్యానించారు. సుమారు 206 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు జేఏసీగా పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలకు తాము నైతిక మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 18 డెడ్‌లైన్
ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మి మోసపోవద్దని కవిత సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను సెప్టెంబర్ 18లోగా నెరవేర్చాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్ దిగ్బంధానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వాలని సూచించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. జీతాలు ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వారు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే ఏ ఆందోళనకైనా టీఆర్ఎస్ నైతికంగా అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.




















