హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం.
సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీస్తూ, కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులతో మాట్లాడుతున్నట్లు వెల్లడించాయి.
కేటీఆర్, హరీశ్ రావు, వినోద్ కుమార్‌తో పాటు జిల్లా నాయకులతో కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, వైద్య చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా వైద్యులు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిలో వస్తున్న మార్పుల గురించి కూడా కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వివరాలు అందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం.




















