నర్సంపేట, ఆగస్టు 8 (జనవాణి): దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పార్టీలోని సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లనున్నారు.
కేవలం ఆర్థికసాయం అందించడమే కాకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. కాగా, సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని.. ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
రేపు నర్సంపేటకు కేసీఆర్
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ ఆదివారం నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులకు ధైర్యం చెప్పనున్నారు.





















