హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కేంద్ర సాయుధ బలగాల కవాతు రిహార్సల్స్‌తో పాటు సాంస్కృతిక ప్రదర్శనల సన్నాహాలను ఆయన వీక్షించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రజాకార్ల దమనకాండను గుర్తు చేసిన కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నప్పటికీ, నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి అప్పట్లో స్వాతంత్య్రం లభించలేదన్నారు. రజాకార్లు గ్రామగ్రామాన హిందువులపై దాడులు, దమనకాండకు పాల్పడి భయానక పరిస్థితులు సృష్టించారని తెలిపారు. ఆ దమనకాండ నుంచి తమను, తమ గ్రామాలను కాపాడుకునేందుకు ప్రజలే స్వయంగా బురుజులు, రక్షణ గోడలు నిర్మించుకుని పోరాడారని గుర్తుచేశారు. ఆనాటి రక్త చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుర్తులు ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకే వేడుకలు
‘హైదరాబాద్ ముక్తి దివస్’ కార్యక్రమం ఏ ఒక్కరికో సంబంధించినది కాదని కిషన్ రెడ్డి అన్నారు. నిజాం పాలనలో అణచివేతను ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి భయపడి ఈ చారిత్రక దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. ఆయా ప్రభుత్వాలు అసెంబ్లీలో చేసిన ప్రకటనలను సైతం పక్కనపెట్టి వేడుకలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు.
వేలాది మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వరుసగా ఈ వేడుకలను నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది వేడుకల్లో కేంద్ర సాయుధ దళాల విన్యాసాలతో పాటు వేలాది మంది తెలంగాణ కళాకారులతో ప్రత్యేక నాట్య ప్రదర్శనలు, సంప్రదాయ డప్పుల విన్యాసాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టేలా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు. తెలంగాణ పౌరుషాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి సెప్టెంబర్ 17న లభించిందని బీజేపీ పేర్కొంటోంది. కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలోనూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ విమర్శిస్తోంది.




















