మునుగోడు, సెప్టెంబర్ 01 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు
తనకు పదవులపై వ్యక్తిగత ఆశ లేదని చెబుతూనే రాజగోపాల్‌రెడ్డి సీఎం పదవిపై ఆసక్తిని పరోక్షంగా వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు దేవుడి దయతో తనకు దక్కాల్సిన పదవిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని వ్యాఖ్యానించారు. ఏ పదవి వచ్చినా దాన్ని వ్యక్తిగత గౌరవంగా భావించబోనని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి కొత్త నేతలపై ఫైర్
ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్‌లోకి రావడాన్ని తాము వ్యతిరేకించడం లేదని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. అయితే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేసిన అసలు కార్యకర్తలను పక్కనబెట్టి కొత్తగా వచ్చిన నేతలు పార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. 'మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతామంటే బాగుండదు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరతీశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్‌ను కబ్జా చేయనివ్వను’
తెలంగాణ కాంగ్రెస్‌ను కొందరు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తాను ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ కబ్జా చేయలేరని తేల్చిచెప్పారు. మునుగోడుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. తాను పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్ ఆశయాలే స్ఫూర్తి
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు రాజకీయ స్ఫూర్తి అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా పనిచేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఇచ్చిన హామీల అమలు, అవినీతికి వ్యతిరేకంగా, పేద ప్రజలకు అండగా తాను పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
Loading Tweet...




















