హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ స్టేషన్ భక్తులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
భక్తుల కల సాకారం
2024లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు తక్కువ కాలంలోనే పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మొదటి ప్రతిపాదనల్లో కొమురవెల్లి స్టేషన్ లేకపోయినా, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సుమారు రూ.6 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు.
రూ.25కే కొమురవెల్లికి ప్రయాణం
సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నడిచే డెమూ (DEMU) రైళ్లు ఇకపై కొమురవెల్లిలో కూడా ఆగనున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ రైళ్లలో అన్ని అన్‌రిజర్వ్డ్ కోచ్‌లే ఉండటంతో సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.25తోనే ప్రయాణించే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు ప్రయాణం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో రైల్వేలకు భారీ పెట్టుబడులు
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. 340 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాల నిర్మాణం పూర్తయిందని, 576 కిలోమీటర్ల మేర డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా 2,034 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పూర్తి చేశామని, ఎంఎంటీఎస్ ఫేజ్-2 విస్తరణ, పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్‌గిరి కొత్త రైల్వే లైన్, కాజీపేట–విజయవాడ ట్రిప్లింగ్ వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
స్టేషన్ల ఆధునీకరణకు ప్రాధాన్యం
తెలంగాణలో రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నాలుగు స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు.
ప్రజల భద్రత కోసం 'కవచ్' సాంకేతికతను తెలంగాణలో 63 స్టేషన్లు, 627 కిలోమీటర్ల రైల్వే మార్గంలో అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కొత్త రైలు సర్వీసులు ప్రారంభించినట్లు వెల్లడించారు.
హైస్పీడ్ రైలు కారిడార్లపై ప్రణాళిక
భవిష్యత్తులో హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నై, పుణే నగరాలతో హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా అనుసంధానించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్ల ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో, చెన్నైకి మూడు గంటల లోపు, పుణేకు రెండు గంటల కంటే తక్కువ సమయంలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
రైల్వే బడ్జెట్‌లో భారీ పెంపు
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రైల్వే మూలధన బడ్జెట్‌ను రూ.2.77 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో రీజనల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు ఇప్పటికే ఆమోదం లభించిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారతీయ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలకు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.




















