హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనవాణి): మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కీలక పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు ఆమెకు సందేశం పంపినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన నేపథ్యంలో ఈ పిలుపు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కొండా సురేఖతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ శుక్రవారం స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో కొండా సురేఖకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో నిర్వహించిన కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఈ కార్యక్రమానికి సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
దీంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆమెను వివరణ కోరింది. దీనిపై కొండా సురేఖ కమిటీకి రెండు లేఖలు సమర్పించారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ చీఫ్‌కు అందించగా.. ఆ నివేదికను తెలంగాణ పీసీసీ చీఫ్ పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుని కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. అయితే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కొండా సురేఖ పేరుతో ఫేస్‌బుక్‌లో ‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ వచ్చిన పోస్టు కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. అయితే ఆ పోస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాలని కొండా సురేఖకు సందేశం పంపడం ఆసక్తిని రేపుతోంది. మంత్రి పదవి కోల్పోయిన కొద్దిరోజుల్లోనే అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో.. ఆమెకు పార్టీ మరో కీలక బాధ్యత లేదా కేబినెట్ స్థాయి పదవి ఇవ్వనుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.




















