కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి.. కేటీఆర్‌ కీలక పిలుపు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సమరభేరి’ కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

24 ఆగస్టు, 2026 12:08 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి.. కేటీఆర్‌ కీలక పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 24 (జనవాణి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘సమరభేరి’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలు, హామీల అమలులో లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను ప్రకటించి.. ప్రతి హామీని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని కేటీఆర్‌ ఆరోపించారు. అయితే 1000 రోజులు పూర్తవుతున్నా హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సాయంతో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్‌ సూచించారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ఎంత బకాయి పడిందనే విషయాన్ని ఈ కార్డుల ద్వారా వివరించాలని అన్నారు.

ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతులు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులను ప్రత్యేకంగా కలసి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒకే తరహా కార్యక్రమాలకు పరిమితం కాకుండా ప్రతి వర్గం సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. సోషల్‌ మీడియాను కూడా సమర్థంగా వినియోగించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. వినూత్న ప్రచార కార్యక్రమాలు, సోషల్‌ మీడియా కంటెంట్‌ ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను యువతతో పాటు కొత్త తరానికి చేరేలా చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ‘సమరభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు