హైదరాబాద్,సెప్టెంబర్ 26 (జనవాణి): నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.114 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తల్లీకొడుకుల భావోద్వేగంతో పాటు యాక్షన్ అంశాలను మేళవిస్తూ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాని, మోహన్‌బాబు నటనతో పాటు దర్శకుడి టేకింగ్, అనిరుధ్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు కేటీఆర్
‘ది ప్యారడైజ్’ సినిమాను తాను థియేటర్‌లో చూడబోతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నానని, తనకు ఇష్టమైన హీరోల్లో ఒకరైన నాని, ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ‘ది ప్యారడైజ్’ను శనివారం రాత్రి చూడబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Loading Tweet...
కేసీఆర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి
‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి పోషించిన పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రియదర్శి కనిపించారని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా ‘ది ప్యారడైజ్’ను థియేటర్‌లో వీక్షించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.
తెలంగాణ నేపథ్య అంశాలకు ప్రాధాన్యం
కేసీఆర్‌ను పోలిన పాత్రతో పాటు సినిమాలో తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన పలు అంశాలను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రల పేర్లలో సమ్మక్క, సారక్క వంటి తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులను ఉపయోగించడం, మోహన్‌బాబు పాత్రను నిజాం పాలనతో పోల్చడం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలను కథలో భాగం చేయడం వంటి విషయాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా ‘ది ప్యారడైజ్’పై వస్తున్న చర్చకు కేటీఆర్ థియేటర్ విజిట్ మరింత ఆసక్తిని జోడించింది.




















