నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సంతాప సందేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
పొన్నం ప్రభాకర్ సంతాపం
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ప్రజా జీవితానికి తీరని లోటని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
నిరంజన్ రెడ్డి ఆవేదన
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో, తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, తనకు వ్యక్తిగతంగా ఆత్మీయుడిగా ఉన్న ఆయన మరణం పార్టీకి, తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు.
శ్రీనివాస్ గౌడ్ నివాళి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోవడం తీవ్ర విషాదకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుంటారనే ఆశతో ఎదురు చూశామని, కానీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ సమాజం, నర్సంపేట ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు.
దాసోజు శ్రవణ్ నివాళి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కూడా తన సంతాప సందేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి నీతి, నిజాయితీ, రాజీలేని పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, విద్యా వ్యవస్థ, పౌరసరఫరాల శాఖల్లో అవినీతిపై ఆయన చేసిన పోరాటాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమ కుటుంబానికి పూడ్చలేని లోటని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పలువురు నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




















