రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్ సహా పలు సంస్థల్లో దుంప శిరీష పాత్ర ఏమిటని ప్రశ్నించిన ఆయన.. రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని సవాల్ విసిరారు.

3 అక్టోబర్, 2026 3:28 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపార భాగస్వామి దుంప శిరీష ఎవరు?..క్రిశాంక్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (జనవాణి): సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి కుమార్తె అనుముల నైమిషా రెడ్డితో వ్యాపార భాగస్వామ్యం చేస్తున్నట్లు చెబుతున్న దుంప శిరీష ఎవరో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్, శోదా కన్‌స్ట్రక్షన్స్, స్వచ్ బయో, టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తదితర సంస్థలకు సంబంధించి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

దుంప శిరీష ఎవరు?

మెడికోవర్ హాస్పిటల్స్‌లో దుంప శిరీష ప్రధాన వాటాదారుగా ఉన్నారని క్రిశాంక్ పేర్కొన్నారు. అలాగే రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి నిర్మిస్తున్న పాఠశాలలోనూ ఆమె భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. ఈ రెండు అంశాలపై రేవంత్‌రెడ్డి విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్‌లో దుంప శిరీష డైరెక్టర్‌గా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాలపై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, వాటి ప్రతులను ఈడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం, ప్రతిపక్ష నేతలకు పంపిస్తానని తెలిపారు.

మెడికోవర్‌పై కీలక ఆరోపణలు

సహృదయ మాతృ సంస్థ ద్వారా మెడికోవర్ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని క్రిశాంక్ తెలిపారు. గత రెండేళ్లలో ఆ సంస్థ ఆదాయం 689 శాతం పెరిగిందని పేర్కొన్నారు. మెడికోవర్ ఆసుపత్రిని రూ.13,300 కోట్లకు విక్రయించారని చెబుతూ ఇంత తక్కువ వ్యవధిలో ఆదాయం అంత భారీగా ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దుంప శిరీష పేరిట పెట్టుబడులు పెట్టి ఆసుపత్రి విక్రయ వ్యవహారం జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సంస్థలు లేదా రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరణ వెలువడాల్సి ఉంది.

నైమిషా రెడ్డి స్కూల్‌పైనా ప్రశ్నలు

కొంపల్లిలో నైమిషా రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని క్రిశాంక్ తెలిపారు. ఈ సంస్థలో దుంప శిరీష, అనుముల నైమిషా రెడ్డి, గీతా ఆటోమోటివ్‌కు సంబంధించిన వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కుమార్తెతో దుంప శిరీషకు ఉన్న వ్యాపార సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీకి క్రిశాంక్ సవాల్

రేవంత్‌రెడ్డి 2024 ఆగస్టులో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా హ్యుందాయ్ సంస్థ ప్రతినిధులను కలిశారని క్రిశాంక్ పేర్కొన్నారు. ఆ తర్వాత గీతా ఆటోమోటివ్స్ పేరుతో ఐదు షోరూమ్‌లు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబ వ్యాపారాలు రెండున్నరేళ్లలో భారీగా పెరిగాయని క్రిశాంక్ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని, ఇకపై ప్రెస్‌మీట్ కూడా పెట్టనని అన్నారు. తనపై గతంలో తీసుకున్న చర్యల నేపథ్యంలో ఈ ఆరోపణలు బయటపెట్టినందుకు మళ్లీ జైలుకు పంపుతారో, ఎన్‌కౌంటర్ చేస్తారో తెలియదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు