కరీంనగర్, ఆగస్టు 7: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లిలో రూ.30 లక్షల వ్యయంతో వెటర్నరీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ.16 లక్షలతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. బొమ్మనపల్లిలో రైతు వేదిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మహిళా సంఘ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ఇతర వివో సంఘాలకు కూడా దశలవారీగా భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో మహిళా సంఘాలకు సరైన ప్రోత్సాహం లభించలేదని విమర్శించారు. ప్రస్తుతం వడ్డీలేని రుణాలతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ పథకాలు, బస్సులు, పెట్రోల్ బంకులు తదితర ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.
ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలు, ప్రతి మండలంలో మండల మహిళా సమైక్య భవనాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల కార్యకలాపాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. స్థానిక మహిళల, ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే బొమ్మనపల్లిలో వివో భవన నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రామాల మధ్య రహదారి అనుసంధానం కోసం 29 వంతెనల నిర్మాణానికి రూ.33 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుర్తి–ములకనూరు వంతెనతో పాటు మరో రెండు పెండింగ్ పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కరీంనగర్ ఫోర్‌లైన్ రహదారి పనులు కూడా ముందుకు సాగుతాయని వెల్లడించారు.
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, హుస్నాబాద్‌లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.





















