భద్రాచలం–విశాఖ రహదారి కారిడార్‌పై ఎంపీ వద్దిరాజు ప్రశ్న.. కీలక సమాచారం వెల్లడించిన కేంద్రం

భద్రాచలం–విశాఖపట్నం రోడ్డు కారిడార్‌ అభివృద్ధిపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని ప్రశ్నించారు. NH-30, NH-16 అనుసంధానం, గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై మంత్రి నితిన్‌ గడ్కరీ వివరాలు వెల్లడించారు.

12 ఆగస్టు, 2026 7:36 PM•ByRalin

Share this article

భద్రాచలం–విశాఖ రహదారి కారిడార్‌పై ఎంపీ వద్దిరాజు ప్రశ్న.. కీలక సమాచారం వెల్లడించిన కేంద్రం

వద్దిరాజు రవిచంద్ర (ఫైల్ ఫొటో)

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనవాణి): భద్రాచలం నుంచి విశాఖపట్నం వరకు రోడ్డు అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచే చర్యలపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని ప్రశ్నించారు. భద్రాచలం–విశాఖపట్నం రోడ్డు కారిడార్‌ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, జాతీయ రహదారులుగా ప్రకటించే ప్రతిపాదనలపై ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం సమాధానం ఇచ్చారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలంటూ ప్రతిపాదనలు వస్తుంటాయని గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారుల ప్రకటనకు సంబంధించి విస్తృత సూత్రాలు, అవసరమైన అనుసంధానత, ట్రాఫిక్‌ సాంద్రత, గిరిజన ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌తో సమన్వయం కూడా పరిశీలిస్తామని వివరించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారి అనుసంధాన పథకం కింద రూ.2,170 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంజూరు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే గిరిజన ఉప ప్రణాళిక కింద రూ.1,711 కోట్ల విలువైన పలు రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

భద్రాచలం–విశాఖపట్నం రోడ్డు కారిడార్‌కు సంబంధించి భద్రాచలం నుంచి చింతూరు వరకు NH-30 ద్వారా అనుసంధానం ఇప్పటికే పూర్తయిందని గడ్కరీ తెలిపారు. ఈ మార్గాన్ని రెండు లేన్లుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, తాళ్లపాలెం మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారి ద్వారా NH-16ను చేరుకోవచ్చని వివరించారు.

విశాఖపట్నం మీదుగా వెళ్లే NH-16ను ఇప్పటికే ఆరు లేన్లుగా అభివృద్ధి చేసినట్లు గడ్కరీ తెలిపారు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా విశాఖపట్నం వరకు రహదారి అనుసంధానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గాలు, వాటి అభివృద్ధి వివరాలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి సభకు వివరించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు