కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ బ్రాండేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసే నేతలు ఆ పార్టీ చరిత్ర, త్యాగాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

31 ఆగస్టు, 2026 8:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్‌ బ్రాండే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హనుమకొండ, ఆగస్టు 31 (జనవాణి): వరంగల్ పశ్చిమ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ బ్రాండేనని అన్నారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్‌ఎస్‌, టీడీపీ పేర్లతో రాజకీయాలు చేస్తున్న నేతల గతాన్ని ప్రస్తావించారు. కేసీఆర్‌ గతంలో వీ.హనుమంతరావు కమిటీలో జనరల్‌ సెక్రటరీగా, చంద్రబాబు నాయుడు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారని నాయిని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పది మంది నాయకులను తయారు చేయగలిగే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని నాయిని విమర్శించారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, దేశం కోసం ఆ పార్టీ నాయకులు ఆస్తులు, జీవితాలను త్యాగం చేశారని అన్నారు. కులం, మతం, సెంటిమెంట్‌ పేరుతో ప్రజలను ప్రలోభపెట్టడం నాయకత్వం కాదని వ్యాఖ్యానించారు. దేశంలో పెద్ద పెద్ద సంస్థల నిర్మాణంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందని నాయిని తెలిపారు. ఆర్థిక నిపుణుల సహకారంతో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వేల వంటి ప్రజా సంస్థలను అభివృద్ధి చేసిందన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌ చేతుల్లో పెడుతోందని ఆరోపించారు.

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కూడా నాయిని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శృతిమించి మాట్లాడుతున్నారని, ప్రజల కోసం ఇప్పటివరకు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలు చేస్తే ఆధారాలు, వాస్తవాలతో మాట్లాడాలని హితవు పలికారు. గత ప్రభుత్వాల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని నాయిని ఆరోపించారు. ఉద్యోగులు, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన పలు అంశాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితులు సవాళ్లుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌పై కూడా నాయిని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కనీసం అవసరమైన అనుమతులు కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల కోసం కృషి చేయడంతో పాటు భూసేకరణకు భారీగా నిధులు కేటాయించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు