నేపాల్, ఆగస్టు 31 (జనవాణి): నేపాల్‌లో ఇటీవల సంభవించిన మెరుపు వరదలకు దారితీసిన భయానక ఘటనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ మంచు గడ్డ విరిగిపడి, మంచు, కొండరాళ్లు, బురద భారీగా లోయలోకి దూసుకెళ్లిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చైనాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ డ్రోన్‌తో చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఈ ఘటన అనుకోకుండా కెమెరాలో రికార్డైంది. సముద్ర మట్టానికి సుమారు 7,200 మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్తాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ మంచు గడ్డ ఒక్కసారిగా విరిగిపడింది. మంచుతో పాటు పెద్దఎత్తున కొండరాళ్లు, బురద సుమారు 1,200 మీటర్ల దిగువన ఉన్న లోయలోకి వేగంగా దూసుకెళ్లాయి. ఈ పరిణామంతో భోటెకోశీ, త్రిశూలి నదుల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి తీవ్ర స్థాయిలో మెరుపు వరదలు సంభవించినట్లు కథనం పేర్కొంది.
ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తు నేపాల్‌తో పాటు టిబెట్‌లోనూ తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో నేపాల్‌లో 903 మంది, టిబెట్‌లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 4,500 మంది ఆచూకీ ఇంకా లభించలేదని పేర్కొంది. భారీ మంచు పర్వతం విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను మాస్సిమో అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది.
Loading Tweet...




















