నిర్మల్, ఆగస్టు 4 : పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో నిర్మల్ జిల్లా పోలీసులు మరోసారి సత్ఫలితాలు సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా తాజాగా రికవరీ చేసిన రూ.12.88 లక్షల విలువైన 112 సెల్‌ఫోన్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. సీఈఐఆర్ పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,377 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు స్వయంగా సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. లేదా మొబైల్‌కు సంబంధించిన వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలతో సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు నమోదైన తర్వాత మొబైల్‌ను బ్లాక్ చేయడంతో పాటు సాంకేతిక ఆధారాలతో గుర్తించి తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
మార్కెట్లు, బస్టాండ్లు, బస్సులు తదితర రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు బిల్లు, ఐఎంఈఐ నంబర్, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానాస్పదంగా విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి కృషి చేసిన ఐటీ కోర్ బృందం, సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్, ఐపీఎస్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





















