‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాట పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్ఫింగ్ వీడియోపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరిజినల్ పాటను పోలినట్టుగా AI సాంకేతికతతో రూపొందించిన ఈ వీడియోను జుగుప్సాకరంగా అభివర్ణించారు. ‘‘డిస్గస్టింగ్.. సిక్ అండ్ షేమ్‌లెస్’’ అంటూ ఎక్స్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
మహిళలను తల్లులుగా, దేవతలుగా గౌరవించే భారతీయ సంస్కృతిలో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించడం అత్యంత దారుణమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మహిళను అవమానించేలా AIని దుర్వినియోగం చేయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తారక్ స్పష్టం చేశారు. వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరంగా సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవసరమైన ప్రతి చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తానని తెలిపారు.
వీడియోను షేర్ చేయొద్దు.. ఎంగేజ్ అవ్వొద్దు
ఇలాంటి వీడియోలను ఎవరూ చూడకూడదని, షేర్ చేయకూడదని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి షేర్ చేసినా లేదా ఎంగేజ్ అయినా అలాంటి కంటెంట్ మరింతగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుందని సూచించారు. ఈరోజు బాధితురాలు మరొకరు కావచ్చని రేపు మన తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. AI సాంకేతికత ఎంతో ఉపయోగకరమైనదే అయినప్పటికీ ఒకరి గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దాన్ని ఉపయోగించడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదని ఎన్టీఆర్ అన్నారు.
AI దుర్వినియోగంపై కఠిన చర్యలు అవసరం
డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ వీడియోల ద్వారా వ్యక్తులను అవమానించే ఘటనలను అరికట్టాల్సిన అవసరం మరింత పెరిగిందని తారక్ పేర్కొన్నారు. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో పాటు, వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది తన ఒక్కరి సమస్య కాదని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎవరికి అయినా ఎదురుకావచ్చని ఎన్టీఆర్ అన్నారు. మహిళల గౌరవం, వ్యక్తిగత భద్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
Loading Tweet...




















