కేరళలో త్రిప్రయార్ శ్రీరాముడి సన్నిధిలో పవన్ కల్యాణ్.. ప్రత్యేక పూజలు

కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు తదితర సేవల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12 సెప్టెంబర్, 2026 12:08 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేరళలో త్రిప్రయార్ శ్రీరాముడి సన్నిధిలో పవన్ కల్యాణ్.. ప్రత్యేక పూజలు

కేరళ,సెప్టెంబర్ 12 (జనవాణి): కేరళలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఆయన.. సమీపంలోని ప్రముఖ శ్రీరామ క్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు దేవస్థానం బోర్డు ఛైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం పవన్ కల్యాణ్ ఆలయంలోని విశిష్ట సేవల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడిని దర్శించుకుని మీనుట్టు సేవలో పాల్గొన్నారు. ఆలయం సమీపంలో ప్రవహించే తీర్వా నదిలో చేపలకు ఆహారం అందించడం ఇక్కడి ఆచారం. చేపలకు ఆహారం అందించడం ద్వారా మత్స్యావతారుడైన విష్ణుమూర్తికి ఆహారం సమర్పించినట్టుగా భక్తులు విశ్వసిస్తారు.

Pooja

ఆ తర్వాత శ్రీరామస్వామి సన్నిధిలో దీపారాధన సేవ నిర్వహించారు. ఒక రోజు దీపారాధన సేవకు అవసరమైన విరాళాన్ని సమర్పించిన పవన్ కల్యాణ్.. స్వయంగా దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ మందిరంలోని ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు. శంఖుచక్రాలతో పాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీరామస్వామి వారి దివ్య రూపాన్ని దర్శించుకున్న పవన్ కల్యాణ్.. సంధ్యాకాల అర్చనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భాలయంలోని దక్షిణామూర్తి, వినాయకుడు, అనంతపద్మనాభ స్వామి శయన రూపాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Jyoti

వేది వజిపాడు సేవలోనూ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం బాణాసంచా పేల్చే ఈ సేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీ ఆంజనేయస్వామి సీతాదేవి ఆచూకీని తన పొలికేక ద్వారా శ్రీరాముడికి తెలియజేయగా, రామస్వామి బాణాసంచా పేల్చడం ద్వారా స్పందించినట్టు స్థానిక పురాణ విశ్వాసం. ఈ సంప్రదాయమే నేటికీ ఆలయంలో కొనసాగుతోంది.

ఈ సేవలో భాగంగా 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే మొత్తాన్ని పవన్ కల్యాణ్ విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ మేల్ శాంతి, ప్రధాన అర్చకులు రామన్ తిరుమేని పవన్ కల్యాణ్‌కు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. చివరగా శ్రీ శాస్తగా భక్తులు కొలిచే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు