న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనవాణి): దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద భారీ స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ తెలిపారు. రాజ్యసభలో సభ్యుడు డా. కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం రూ.32,961.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 11,001 భవన రహిత సబ్ హెల్త్ సెంటర్–ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం, బలోపేతానికి ఆమోదం లభించినట్లు తెలిపారు.
ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమైనప్పటికీ, ప్రాజెక్టులకు అవసరమైన పరిపాలనా అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. అలాగే సమీక్షా సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతర పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగాన్ని నిరంతరం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఎయిమ్స్ బీబీనగర్‌కు కీలక పాత్ర
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధనలో ఎయిమ్స్ బీబీనగర్ కీలక కేంద్రంగా సేవలందిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. అక్కడ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ (VRDL), వన్ హెల్త్ ప్రాంతీయ సమన్వయ కేంద్రం, ఆల్ ఇండియా నెట్‌వర్క్ ప్రోగ్రామ్ ఆన్ వన్ హెల్త్, యోగ ఆధారిత మైండ్–బాడీ ఇంటర్వెన్షన్స్ పరిశోధన కేంద్రం (CCMBIY), మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ వంటి ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.





















