బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్ ఉపఎన్నికలో చారిత్రక విజయం

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే సంచలన విజయం సాధించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచి, మూడు దశాబ్దాలుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగిన నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు.

3 ఆగస్టు, 2026 5:44 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్ ఉపఎన్నికలో చారిత్రక విజయం

Social media Image

దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజాప్రతినిధిగానూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసూరజ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ప్రశాంత్ కిషోర్ మొదటిసారిగా చట్టసభలో అడుగుపెట్టనున్నారు.

బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి దాదాపు మూడు దశాబ్దాలుగా కంచుకోటగా కొనసాగుతోంది. 1995 నుంచి ఈ ప్రాంతంలో బీజేపీ వరుస విజయాలను నమోదు చేస్తూ వచ్చింది. తాజాగా రాజ్యసభకు ఎన్నికైన నితిన్ నబీన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన సన్నిహిత నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దించగా, జనసూరజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేశారు. జూలై 30న జరిగిన పోలింగ్‌కు ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టగా, తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగారు. ప్రతి రౌండ్‌లోనూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ చివరకు 20 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం బిహార్ రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ గూర్చి..

ఐక్యరాజ్య సమితిలో ప్రజారోగ్య నిపుణుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్, అనంతరం రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన ఐ-ప్యాక్ (I-PAC) ద్వారా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్, 2015లో బిహార్ మహాఘట్ బంధన్, 2019లో వైఎస్సార్సీపీ, 2020-21లో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ విజయాల్లోనూ వ్యూహకర్తగా పనిచేశారు. ఇప్పుడు వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం, బిహార్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు