ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ అందించింది. వర్షాభావ పరిస్థితుల క్రమంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన మూడు నెలల సరుకులు ఒకేసారి పంపిణీ చేయనున్నారు అధికారులు. రేషన్‌ను ఈ నెలలోనే అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందిస్తోంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అందించనుంది.
ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ డీలర్లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకేసారి భారీ స్థాయిలో బియ్యం, ఇతర సరుకులను నిల్వ ఉంచడం తమకు భారంగా మారిందని వారు చెబుతున్నారు. అంతేకాకుండా రేషన్ పంపిణీలో ఉపయోగించే ఈ-పాస్ (e-POS) యంత్రాలు తరచూ సాంకేతిక సమస్యలకు గురవుతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కార్డుదారుడు రేషన్ తీసుకోవాలంటే మూడుసార్లు వేలిముద్రలు నమోదు చేయాల్సి వస్తోందని, దీంతో ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని అంటున్నారు. వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు, ఈ-పాస్ యంత్రాలు మధ్యలో పనిచేయకుండా మొరాయించడం వంటి కారణాలతో రేషన్ పంపిణీకి అంతరాయం కలుగుతోందని తెలిపారు.
ఒక్కో రేషన్ కార్డుదారుడికి మూడు నెలల సరుకును పంపిణీ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోందని, దీంతో దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ-పాస్ యంత్రాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసే చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.




















