వైద్య రంగంలో మౌలిక వసతులు, వైద్య విద్య ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సనత్‌నగర్ టిమ్స్‌కు పేరు మార్పు, ఉన్నతాధికారుల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
మర్రి చెన్నారెడ్డి పేరుతో టిమ్స్
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా సనత్‌నగర్ టిమ్స్‌కు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ వైద్య సంస్థను "డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)" పేరుతో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.63 జారీ చేసింది.
టిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్ర కుమార్
ప్రస్తుతం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)గా పనిచేస్తున్న డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ జూలై 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన సుదీర్ఘ పరిపాలనా అనుభవాన్ని టిమ్స్ అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌కు ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ జీవో ఎంఎస్ నం.64 జారీ చేసింది. ఆయన ఆగస్టు 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
డీఎంఈగా డాక్టర్ ఎన్. వాణి
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, అదనపు డీఎంఈగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. వాణిని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన జీవో ఆర్టీ నం.318ను జారీ చేసింది. గతంలోనూ డీఎంఈగా పనిచేసిన అనుభవం డాక్టర్ వాణికి ఉంది.
ఈ నిర్ణయాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేసిన జాతీయ నాయకుడని కొనియాడారు. వైద్యునిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ప్రజా సేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సనత్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అత్యున్నత ప్రమాణాలతో టిమ్స్
డాక్టర్ నరేంద్ర కుమార్‌కు ఉన్న పరిపాలనా అనుభవంతో సనత్‌నగర్ టిమ్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. వీలైనంత త్వరగా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
డీఎంఈగా బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ ఎన్. వాణికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, టీచింగ్ హాస్పిటళ్లను మరింత బలోపేతం చేయడం, వైద్య విద్యలో నాణ్యత పెంచడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆమె అనుభవం కీలకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




















