సంగారెడ్డి,సెప్టెంబర్ 17 (జనవాణి): జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో బిర్యానీ తిన్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బిర్యానీ తీసుకొచ్చారు. విద్యార్థులతో కలిసి ఆయన కూడా భోజనం చేశారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులతో పాటు వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థులకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. కాగా, వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.




















