సంగారెడ్డి, ఆగస్టు 11 (జనవాణి): సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో యూటర్న్ వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కర్ణాటకలోని హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వైపు ట్యాంకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలి పనుల కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోను ట్యాంకర్ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఘటనాస్థలిలోనే ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో రేఖ, శ్రీదేవి, కవిత రేష్మ, ఆటో డ్రైవర్ దేవదాస్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో నిర్మల, నిఖిత, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరికి చెందినవారిగా గుర్తించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





















