‘మీ పార్టీలోకి వస్తే పవిత్రులు.. పక్క పార్టీలోకి వెళితే అనైతికులా?’..బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్‌

బీఆర్‌ఎస్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్‌’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు రాజకీయ విమర్శలకు ముందు తమ గతాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.

4 సెప్టెంబర్, 2026 4:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘మీ పార్టీలోకి వస్తే పవిత్రులు.. పక్క పార్టీలోకి వెళితే అనైతికులా?’..బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్‌

ములుగు, సెప్టెంబర్ 04 (జనవాణి): బీఆర్‌ఎస్‌లో ఇతర రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్‌’ అంటూ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క అన్నారు. టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకులు ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా ‘పచ్చ పార్టీ’ అని పిలవాలా? అని ప్రశ్నించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇతర పార్టీల నాయకుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ చరిత్రను గుర్తు చేసుకోవాలని సీతక్క సూచించారు. ‘మీ పార్టీలోకి వస్తే పవిత్రులు.. పక్క పార్టీలోకి వెళితే అనైతికులా? ఇదేనా మీ రాజకీయ సంస్కారం?’ అని నిలదీశారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం కూడా ఏ పార్టీ నుంచి ప్రారంభమైందో గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

సంక్షేమంపై అసూయ ఎందుకు?

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుండటాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఓర్వలేక నిరసనల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీతక్క విమర్శించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పేదలకు లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించిన సీతక్క.. తమ ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. రైతులకు సన్నవడ్లపై బోనస్‌ ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసి, అదే సన్నబియ్యాన్ని పేద కుటుంబాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.

హామీలపై బీఆర్‌ఎస్‌ను నిలదీత

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత ఎరువులు అందిస్తామని, దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి, ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తు చేసుకోవాలని సీతక్క అన్నారు. పదేళ్ల పాలనలో ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్‌, ఉద్యోగాల భర్తీ, మహిళా సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలతో చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ చేశారు.

కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో కూడా ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని సీతక్క డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సహకారం ఎందుకు అందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

దూషణలు, పోస్టర్లపై హెచ్చరిక

వ్యక్తిగత దూషణలు, అవమానకర పోస్టర్లతో రాజకీయాలను దిగజార్చవద్దని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను సీతక్క హెచ్చరించారు. తమ నాయకులు, ప్రజాప్రతినిధులను కించపరిచేలా పోస్టర్లు వేస్తే సహించేది లేదన్నారు. రాజకీయాలు హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని సూచించారు. ‘మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మేము సహనంతో ఉన్నామని చేతకానితనంగా భావించవద్దు. ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టిగా సమాధానం చెబుతాం’ అని సీతక్క హెచ్చరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు