హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): స్పీకర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తనకు ఆపాదిస్తున్న మాటలు తాను చెప్పినవి కావని పేర్కొన్నారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఒకవేళ తాను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.
తాజాగా జరిగిన ఘటనపై తాతా మధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి జరిగిందని ఆరోపించారు. తనపై కూడా దాడి చేసి ప్యాంటు లాగేందుకు ప్రయత్నించారని, గొంతు నొక్కేందుకు యత్నించారని పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఎవరు చేశారు? నా ప్యాంటు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు? అలా చేయాలని ఎవరు ఆదేశించారు? అని ఆ సమయంలో తాను ప్రశ్నించానని, అయితే స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తాతా మధు స్పష్టం చేశారు.
శాంతియుతంగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతు నొక్కడం వంటి ఘటనలు సిగ్గుచేటని ఆరోపించారు. యాదవరెడ్డి, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, డాక్టర్ సంజయ్ తదితరులపై పోలీసులు దాడి చేసి ఈడ్చుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని తాతా మధు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి అసలు ఘటనను పక్కదారి పట్టించకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.





















