హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో విడత ప్రక్రియపై బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. SIR ప్రక్రియ ముగియడానికి ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉందని.. ఈలోగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలని సూచించారు.
ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో శనివారం SIR ఫేజ్-2పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, SIR రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రెండు రోజుల్లో నమోదు పూర్తి చేయాలి
SIR ప్రక్రియకు మరో రెండు రోజులే గడువు ఉన్నందున పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని రాంచందర్‌రావు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లందరికీ ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు.
ఆగస్టు 10తో SIR ప్రక్రియ పూర్తయినప్పటికీ.. ఆ తర్వాత కూడా పలు కీలక దశలు ఉంటాయని రాంచందర్‌రావు తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అభ్యంతరాల దాఖలు వంటి అంశాలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఫారమ్-7, 8పై దృష్టి
ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారమ్-7, ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలకు సంబంధించిన ఫారమ్-8లను నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని సూచించారు. ఎన్నికల అధికారుల నుంచి వచ్చే నోటీసులకు అవసరమైన ఆధారాలతో న్యాయపరంగా సమాధానాలు ఇవ్వాలని బీఎల్‌ఏ-1లు, లీగల్ టీమ్‌లకు దిశానిర్దేశం చేశారు.
పోలింగ్ బూత్‌లపైనా నిఘా
పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని రాంచందర్‌రావు కోరారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ బాధ్యతను బీజేపీ ప్రతినిధులు సమర్థంగా నిర్వహించాలని సూచించారు.




















