హైదరాబాద్, ఆగస్టు 15 (జనవాణి): తెలంగాణలో నైపుణ్య విద్యకు మరింత ప్రాధాన్యం ఇచ్చే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఈ విద్యాసంస్థలను ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు.
స్కిల్స్ విద్యకు కొత్త దిశ
మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌లను కూడా దాని పరిధిలోకి తీసుకురావడంతో నైపుణ్య విద్యను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించడంతో పాటు.. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఏడు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటివరకు 86 స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.
3.42 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసి 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0
గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది Telangana Rising Global Summit 2.0 నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఈసారి ‘Invest Telangana’ థీమ్‌తో సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా Bharat Future City ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సు నిర్వహించనున్నారు.
మిగులు ధాన్యాన్ని ఈ-ఆక్షన్‌లో విక్రయం
వానాకాలంలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులకు అవగాహన కల్పించి ఈ రకాల సాగును పెంచాలని తీర్మానించింది.
యాసంగిలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఇందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సేకరించనుండగా.. మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నులను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్ ప్రైస్‌గా నిర్ణయించారు.
హైదరాబాద్ ఆటోలకు రూ.1.50 లక్షల సబ్సిడీ
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నగరంలో ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.
అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనంపై గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. పాత ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
HILT గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
హైదరాబాద్ నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తు గడువును కేబినెట్ మరో మూడు నెలలు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఎత్తిపోతల పథకానికి రూ.2,100 కోట్లు
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కల్పించేందుకు అవకాశం ఏర్పడనుంది.
గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.





















