చేయూత పింఛన్‌ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు

తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన వారు సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

1 సెప్టెంబర్, 2026 12:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

చేయూత పింఛన్‌ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనవాణి): తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో 15 రోజులు పొడిగించింది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.

రాష్ట్రంలో చేయూత కొత్త పింఛన్ల కోసం ఆగస్టు 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు అనే ఐదు కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరించారు. తొలుత ఆగస్టు 31ని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. అయితే గడువు ముగిసే నాటికి 4,81,662 దరఖాస్తులు అందాయి. సమయం తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలు, అవసరమైన పత్రాలు సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో పలువురు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ సెర్ఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ఏ ఒక్కరూ పింఛన్‌ పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఏ కేటగిరీలో ఎన్ని దరఖాస్తులు?

ఆగస్టు 31 నాటికి వచ్చిన 4,81,662 దరఖాస్తుల్లో అత్యధికంగా 2,89,342 దరఖాస్తులు వితంతువుల కేటగిరీ నుంచి వచ్చాయి. 1,11,652 దరఖాస్తులు దివ్యాంగుల నుంచి అందాయి.

వితంతువులు: 2,89,342

దివ్యాంగులు: 1,11,652

ఒంటరి మహిళలు: 38,452

చేనేత కార్మికులు: 12,750

గీత కార్మికులు: 30,416

దరఖాస్తుల పరిశీలన ఎలా?

చేయూత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. దరఖాస్తుదారుల అర్హతలను నిబంధనల ప్రకారం తనిఖీ చేసి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. అనంతరం తుది జాబితా రూపొందించి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నారు. చేయూత పింఛన్‌కు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు సెప్టెంబర్‌ 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు