హైదరాబాద్,సెప్టెంబర్ 18 (జనవాణి): తెలంగాణలో దసరా పండుగ సందడి మొదలైంది. వచ్చే నెలలో దసరా పండుగ ఉండటంతో విద్యార్థులు ఇప్పటికే సెలవులపై దృష్టి పెట్టారు. 2026-27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈసారి పాఠశాలలకు 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి.
అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 9 విద్యార్థులకు చివరి వర్కింగ్ డే కాగా అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు సెలవుల్లో ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్లాన్లు చేసుకుంటున్నారు.
అక్టోబర్ 20న దసరా
తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ 20న దసరా పండుగ జరుపుకోనున్నారు. దీంతో పండుగకు ముందుగానే సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ షాపింగ్‌తో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కూడా సందడిగా మారుతున్నాయి.
అక్టోబర్ 11 నుంచి బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానమున్న బతుకమ్మ పండుగ కూడా ఈ సెలవుల్లోనే ప్రారంభం కానుంది. అక్టోబర్ 11న బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. అక్టోబర్ 19న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. దీంతో బతుకమ్మ, దసరా పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకునేందుకు మహిళలు, ఆడపడుచులు సిద్ధమవుతున్నారు.
ముఖ్యమైన తేదీలు
దసరా సెలవులు ప్రారంభం: అక్టోబర్ 10, 2026
బతుకమ్మ వేడుకలు ప్రారంభం: అక్టోబర్ 11, 2026
సద్దుల బతుకమ్మ: అక్టోబర్ 19, 2026
దసరా పండుగ: అక్టోబర్ 20, 2026
దసరా సెలవులు ముగింపు: అక్టోబర్ 22, 2026
స్కూల్స్ రీఓపెన్: అక్టోబర్ 23, 2026




















