తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు అదనపు బిల్లుల భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ లోటును సర్దుబాటు చేసుకునేందుకు డిస్కంలు కోరిన ట్రూఅప్ ఛార్జీల వసూలుకు టీజీఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.7,635.22 కోట్లను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించగా అందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తాన్ని మినహాయించి రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.
నవంబర్ నుంచి అదనపు ఛార్జీలు
ట్రూఅప్ ఛార్జీలను ఒకేసారి కాకుండా దశలవారీగా వసూలు చేయనున్నారు. నవంబర్‌లో జారీ చేసే విద్యుత్ బిల్లులో యూనిట్‌కు 30 పైసలు అదనంగా విధిస్తారు. డిసెంబర్ నుంచి జారీ చేసే బిల్లుల్లో యూనిట్‌కు 50 పైసల చొప్పున ట్రూఅప్ ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ వసూళ్లు దక్షిణ తెలంగాణ డిస్కం (టీజీఎస్‌పీడీసీఎల్) పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం (టీజీఎన్‌పీడీసీఎల్) పరిధిలో 26 నెలలు కొనసాగనున్నాయి.
వ్యవసాయ వినియోగదారులకు ఊరట
ట్రూఅప్ ఛార్జీల విషయంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు టీజీఈఆర్‌సీ ఊరట కల్పించింది. మొత్తం లెక్కించిన రూ.7,635.22 కోట్లలో రూ.2,214.99 కోట్లు వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఈ మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని డిస్కంలను కమిషన్ ఆదేశించింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తంలో దక్షిణ తెలంగాణ డిస్కం వాటా రూ.1,442.49 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కం వాటా రూ.772.50 కోట్లుగా ఉంది.
డిస్కంలు కోరింది రూ.7,635 కోట్లు
2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా అయిన వ్యయం, 2023-24లో ఏర్పడిన ఆదాయ లోటును కలిపి డిస్కంలు మొత్తం రూ.7,635.22 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతి కోరాయి. ఇందులో 2022-23 విద్యుత్ కొనుగోలుకు అదనపు వ్యయం రూ.5,186.29 కోట్లు కాగా.. 2023-24లో నమోదైన ఆదాయ లోటు రూ.2,448.93 కోట్లు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన టీజీఈఆర్‌సీ.. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను మినహాయించి, మిగిలిన రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించింది.
బిల్లులో ప్రత్యేకంగా చూపించాలి
ట్రూఅప్ ఛార్జీల వసూలుపై టీజీఈఆర్‌సీ కొన్ని నిబంధనలు విధించింది. ప్రతి నెలా జారీ చేసే విద్యుత్ బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను ప్రత్యేక అంశంగా చూపించాలని ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలను వసూలు చేస్తున్నారో, యూనిట్‌కు ఎంత ఛార్జీ విధిస్తున్నారో, మొత్తం ఎలా లెక్కించారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. సాధారణ విద్యుత్ ఛార్జీల్లో కలిపి చూపకుండా ట్రూఅప్ మొత్తాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలని కమిషన్ స్పష్టం చేసింది.
ట్రూఅప్ ఛార్జీలు అంటే ఏమిటి?
ప్రతి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు వ్యయం, డిస్కంల ఆదాయం తదితర అంశాలపై అంచనాలు రూపొందించి ఈఆర్‌సీకి సమర్పిస్తారు. వాటి ఆధారంగా విద్యుత్ టారిఫ్‌ను నిర్ణయిస్తారు. అయితే వాస్తవంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు అంచనాల కంటే పెరగడం లేదా వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయం అంచనాల కంటే తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అంచనాలు, వాస్తవ వ్యయాలు లేదా ఆదాయాల మధ్య ఏర్పడిన ఈ వ్యత్యాసాన్ని తర్వాతి కాలంలో సర్దుబాటు చేసి వసూలు చేసే మొత్తాలను ట్రూఅప్ ఛార్జీలు అంటారు. ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఈ అదనపు భారంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం భరించనుండగా.. మిగిలిన రూ.5,420.23 కోట్ల భారం గృహ, వ్యాపార, ఇతర వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులపై పడనుంది.



















