మత్స్యకారులకు తెలంగాణ సర్కార్‌ భరోసా.. 4.21 లక్షల మందికి ప్రమాద బీమా!

తెలంగాణలో 4,21,767 మంది మత్స్యకారులకు 2026-27లో గ్రూప్‌ ప్రమాద బీమా పథకం అమలు కానుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ లభించనుంది.

10 ఆగస్టు, 2026 4:03 PM•ByLaharika

Share this article

మత్స్యకారులకు తెలంగాణ సర్కార్‌ భరోసా.. 4.21 లక్షల మందికి ప్రమాద బీమా!

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనవాణి): మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్‌ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

మత్స్యకారుల సామాజిక భద్రత, జీవనోపాధి రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

4.21 లక్షల మంది బీమా పరిధిలోకి

2026-27 సంవత్సరంలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ప్రతి లబ్ధిదారుడికి రూ.79.96 చొప్పున బీమా ప్రీమియం ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఆ మొత్తాన్ని భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లించనుందని చెప్పారు.

మత్స్యకారులపై ప్రీమియం భారం లేదు

గ్రూప్‌ ప్రమాద బీమా ప్రీమియం కోసం మత్స్యకారులు ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రీమియం భారం భరిస్తాయని తెలిపారు. దీంతో అర్హులైన నమోదిత మత్స్యకారులకు ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండానే ప్రమాద బీమా రక్షణ లభించనుంది.

ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు

గ్రూప్‌ ప్రమాద బీమా పథకం కింద ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. అలాగే శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది.

ప్రమాదంలో ఆసుపత్రి పాలైతే..

ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందే మత్స్యకారులకు కూడా బీమా పథకం ద్వారా వైద్య సహాయం అందుతుంది. గరిష్ఠంగా రూ.25,000 వరకు వైద్య ఖర్చులకు సహాయం లభించనుంది.

2026 జూన్‌ 1 నుంచి పాలసీ అమలు

2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు.. మత్స్యకారుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సామాజిక భద్రతకు పెద్దపీట

మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో గ్రూప్‌ ప్రమాద బీమా పథకం కీలకమైనదని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు