తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ భరోసా.. రూ.కోటి బీమా!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి రూ.కోటి వరకు ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బీమాతో పాటు ఇతర ప్రయోజనాలు కలిపి కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

10 సెప్టెంబర్, 2026 5:32 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ భరోసా.. రూ.కోటి బీమా!

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనవాణి): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు దురదృష్టవశాత్తు మరణించిన సమయంలో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.కోటి ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.

12.91 లక్షల మందికి బీమా కవరేజీ

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మంది ఈ బీమా పథకం పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 5,18,293 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా.. 5,00,158 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, మల్టీపర్పస్‌ వర్కర్లు, డైలీవేజ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఎంటీఎస్‌, సెర్ప్‌ తదితర సిబ్బంది ఉన్నారు. మరో 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారు.

16 బ్యాంకులతో ఒప్పందం

ఉద్యోగులకు జీతాలు చెల్లించే బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం 16 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బ్యాంకులకు ఉద్యోగుల జీతాల ఖాతాల ద్వారా వ్యాపార ప్రయోజనం కలుగుతున్నందున, వారి సహకారంతో బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈ పథకానికి ప్రభుత్వంపై, ఉద్యోగులపై ప్రీమియం భారం లేకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

2024లో సింగరేణితో ప్రారంభం

ఉద్యోగులకు రూ.కోటి బీమా పథకాన్ని తొలుత సింగరేణి కాలరీస్‌లో ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అనంతరం విద్యుత్‌ శాఖ పరిధిలోని డిస్కమ్‌లు, ఇతర సంస్థలకు విస్తరించారు. 2024 ఫిబ్రవరిలో సింగరేణి ఉద్యోగులకు, 2025లో ఇంధన శాఖ ఉద్యోగులకు, 2026 జూన్‌ 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు 2024 జూన్‌ 26న ఆర్థిక శాఖ 77వ జీవో సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు విధానం, అర్హతలు, బీమా కవరేజీ, నిబంధనలు, షరతులను అందులో పేర్కొన్నట్లు వివరించారు.

ఇప్పటివరకు 33 క్లెయిమ్‌లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు 33 బీమా క్లెయిమ్‌లు వచ్చాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 24 క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు చెప్పారు.

విద్యుత్‌ శాఖకు చెందిన ఎస్పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌, టీజీ జెన్‌కో, ట్రాన్స్‌కో పరిధిలో 15 క్లెయిమ్‌లు రాగా.. అన్నింటినీ పరిష్కరించినట్లు తెలిపారు. ఈ విభాగంలో రూ.15 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. సింగరేణి కాలరీస్‌లో వచ్చిన 50 క్లెయిమ్‌లను కూడా పరిష్కరించినట్లు చెప్పారు.

రూ.1.20 కోట్ల వరకు ప్రయోజనం

ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.కోటి బీమాతో పాటు ఇతర ప్రయోజనాలు కలిపి మొత్తం రూ.1.20 కోట్ల వరకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

విమాన ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల వరకు బీమా ప్రయోజనం అందే వెసులుబాటు ఉందన్నారు. అలాగే సహజ మరణానికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం కల్పించే అవకాశం ఉన్నట్లు వివరించారు.

హెల్త్‌కార్డుతో క్యాష్‌లెస్‌ వైద్యం

బీమా పథకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం హెల్త్‌కార్డు పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న క్యాష్‌లెస్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత ముఖ్య కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చల అనంతరం హెల్త్‌కార్డు విధానాన్ని ఖరారు చేసినట్లు వివరించారు. క్యాష్‌లెస్‌ వైద్యం, సీజీహెచ్‌ఎస్‌ ప్యాకేజీ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

హెల్త్‌కార్డు పథకం కోసం ఇప్పటికే సుమారు రూ.240 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం బీమా, ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌కార్డు.. ఈ రెండు పథకాల ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా, వైద్యపరంగా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు