జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం.. సీఎం రేవంత్‌తో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

7 ఆగస్టు, 2026 9:56 PM•ByRalin

Share this article

జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం.. సీఎం రేవంత్‌తో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనవాణి): తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పేవిలియన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అనుగుణంగా ఆదాయ వనరులను పెంచే వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్‌ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, సాంకేతికత వినియోగంపై సమీక్షించారు.

జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పన్నుల అంచనా, పర్యవేక్షణను మరింత సమర్థవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగేలా, అదే సమయంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మరింత మెరుగుపడేలా టెక్నాలజీని వినియోగించాలని అరవింద్‌ సుబ్రమణియన్‌ సూచించారు.

పన్నుల లీకేజీలను అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పన్ను ఎగవేతను నివారించేందుకు మున్సిపల్‌, రేరా, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా అనుసంధానించాలని సూచించారు.

భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు మంజూరు చేసే దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, వాటికి సంబంధించిన పన్నుల అంచనాలను నమోదు చేసే విధానాన్ని రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమాచారాన్ని మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వంటి ప్రభుత్వ డేటాతో అనుసంధానం చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్‌ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు