హైదరాబాద్, సెప్టెంబర్ 03 (జనవాణి): తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన చిన్నారెడ్డి–మేఘారెడ్డి వివాదానికి కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ నేతలు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేఘారెడ్డిపై చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
ఆగస్టు 16న వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిన్నారెడ్డి.. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి టికెట్ తనకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెప్పారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిటీ తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులకు ఆశపడిందని ఆరోపించారు. మేఘారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారని విమర్శించారు. తన పనులకు అడ్డుపడుతున్నారని, తన అనుచరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఓపిక నశిస్తే తాను మరో జీవన్‌రెడ్డిలా తిరగబడతానని హెచ్చరించారు.
చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మేఘారెడ్డి ఫైర్
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ పొందానని నిరూపించాలని చిన్నారెడ్డికి సవాల్ విసిరారు. నగదు ఎవరికి ఇచ్చానో పేర్లు కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సర్వే నిర్వహించి గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని మేఘారెడ్డి తెలిపారు. చిన్నారెడ్డి గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న అనవసర వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
విజయలక్ష్మికి కీలక బాధ్యతలు
చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తాజా పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది.




















