హైదరాబాద్, ఆగస్టు 11 (జనవాణి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగులు చిరకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసి, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని శాఖ కార్యదర్శి కంభంపాటి శారదను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGOA), తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TGARIEA) రాష్ట్ర నాయకులు మంగళవారం సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి గురుకులాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రమోషన్ల ఫైల్‌పై మంత్రి సంతకం చేసి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపినట్లు నాయకులు తెలిపారు. ప్రమోషన్లు పొందే ఉద్యోగులు గురుకులాల పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేలా బాధ్యతతో, సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కార్యదర్శికి ఫోన్ ద్వారా కూడా సూచించినట్లు తెలిపారు.
1,400 ప్రమోషన్లు విడుదల చేయాలని విజ్ఞప్తి
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జోనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్స్‌తోపాటు ఇతర అన్ని క్యాడర్లకు సంబంధించిన సుమారు1,400 ప్రమోషన్లను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కోరారు. ప్రమోషన్లు లేకపోవడంతో అనేక కీలక పోస్టులు ఇన్‌చార్జి అధికారులతో కొనసాగుతున్నాయని, దీనివల్ల గురుకులాల పరిపాలనా వ్యవస్థపై ప్రభావం పడుతోందని వివరించారు.
ఇదే అంశంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సాంఘిక సంక్షేమ శాఖకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. డిప్యూటీ సెక్రటరీ పోస్టుల భర్తీలో నిర్దేశిత 3:1 నిష్పత్తి పాటించడం, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం, ఖాళీగా ఉన్న కీలక పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని కోరింది.
2023 నుంచి ఖాళీగా కీలక పోస్టులు
2023 నుంచి కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జి వ్యవస్థ కొనసాగుతోందని TGOA తెలిపింది. అర్హులైన సీనియర్, అకడమిక్ అధికారులకు ప్రమోషన్లు ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొంది.
మంత్రి చొరవపై ఉద్యోగుల హర్షం
TGARIEA రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నరసింహులు గౌడ్ మాట్లాడుతూ.. గురుకుల ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ల అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు. ఫైల్‌పై వెంటనే సంతకం చేసి కార్యదర్శికి పంపడం ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేసి అన్ని క్యాడర్లకు సంబంధించిన ప్రమోషన్ల ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో చొరవ చూపిన TGOA రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, TGARIEA సెంట్రల్ యూనిట్ అధ్యక్షుడు మామిడి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జనార్దన్, ఎస్.గణేష్ తదితర నాయకులకు గురుకుల ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
గురుకులాల బలోపేతానికి కీలకం
ప్రమోషన్లు కేవలం ఉద్యోగుల వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే కాదని.. గురుకులాల పరిపాలనను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యా, సంక్షేమ సేవలు అందించేందుకు కూడా అవి కీలకమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
అర్హత, సీనియారిటీ, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రమోషన్లు కల్పిస్తే ఉద్యోగుల్లో బాధ్యత, ఉత్సాహం మరింత పెరుగుతుందని అన్నారు. ప్రమోషన్ల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్స్, జోనల్ ఆఫీసర్లు, ఇతర అన్ని క్యాడర్లకు ప్రమోషన్లు వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.





















